అమలు కాని మంత్రి మాట
మొదలు కాని లబ్ధిదారుల ఎంపిక
కొత్త ఇళ్లకు 'బోగస్' అడ్డంకి
ఎంతకీ తేలని అనర్హుల లెక్క
బడ్జెట్‌లోనూ అరకొర కేటాయింపులు
కొత్త ఇళ్ల మంజూరుపై సందేహాలు
ముందే హెచ్చరించిన 'ఆంధ్రజ్యోతి'
'ఇందిరమ్మ' ఇంటి కథ కంచికి చేరుతోంది. మంజూరు చేసిన వాటిలో లక్షల ఇళ్లు బోగస్! మంత్రిగారి మాటలు బోగస్! అంకెల గొప్పలకు పోయి విచ్చలవిడిగా లక్షల్లో ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 'బోగస్' ఏరివేత ప్రారంభించారు. ఈ ప్రహసనం ముగియకముందే... ఫిబ్రవరిలో కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ... ఆ తర్వాత ఊసే మరిచిపోయింది.
కొత్త ఇళ్ల మంజూరు గురించి జనవరి 11న గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ శాఖకు చెందిన ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం తెలిపారు. అయితే.. ఫిబ్రవరి నెల గడిచినా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ మొదలుకాలేదు. అసలు ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
పాత లబ్ధిదారుల్లో బోగస్ లెక్క తేలితేగానీ... కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వం అడగని వాడిదే పాపం అన్నట్లుగా... అర్హతలతో సంబంధం లేకుండా అడ్డగోలుగా ఇళ్ళు మంజూరు చేస్తూ పోయింది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ 'రికార్డు' స్థాయిలో ఇళ్ల సంఖ్య పెంచుకుంటూ పోయింది.
ఇందిరమ్మ తొలి దశలో 23,91,776... రెండో దశలో 29,58,870 ఇళ్లు, మూడో దశ కింద 25,26,059 ఇళ్ళు మంజూరు చేశారు. దీంతో పాత ఇళ్ళు 2,62,572 కలుపుకొంటే మూడు దశల్లో ఇందిరమ్మ కింద మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య 81,29,277కి చేరింది. ఇందిరమ్మ పథకం తొలి దశ పూర్తయినప్పుడే... ఈ పథకం బోగస్ లబ్ధిదారుల చేతుల్లోకి వెళుతోందని 'ఆంధ్రజ్యోతి' వెలుగులోకి తెచ్చింది.
అనర్హులకు ఇల్లు మంజూరు చేయడం, ఒక్కొక్కరు రెండు మూడేసి ఇళ్లు మంజూరు చేయించుకోవడం, మితిమీరిన రాజకీయ జోక్యం... వంటి అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 'బోగస్ ఇల్లు చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమతి' అని ప్రకటించారు. ఆ తర్వాత 'ఆంధ్రజ్యోతి' ఎన్నో బోగస్ ఇళ్లను చూపించింది.
వామపక్షాలు సైతం ఇందిరమ్మ ఇళ్లలో అవతకవతకలపై ఉద్యమించాయి. ఈ వాస్తవాలను కొట్టివేస్తూ వచ్చిన ప్రభుత్వానికి... రెండోసారి అధికారంలోకి వచ్చాకగానీ అసలు విషయం అర్థం కాలేదు. పరిస్థితి తీవ్రతను గమనించి ప్రభుత్వమే బోగస్ లబ్ధిదారుల ఏరివేత ప్రారంభించింది. దుర్వినియోగమైన నిధులను రెవెన్యూ రివకరీ చట్టం ద్వారా రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు బోగస్ లబ్ధిదారుల గుర్తింపుతో ముడిపెట్టి... కొత్త లబ్ధిదారుల ఎంపికను జాప్యం చేస్తోంది.
అసలుకే చిల్లు...
ఇందిరమ్మ పథకం కింద మూడు దశల్లో మంజూరు చేసిన ఇళ్లలో వాటిలో 19 లక్షల లబ్ధిదారుల వివరాలు 'ఆన్‌లైన్'లో నమోదు కాలేదు. దీంతోపాటు మరో 17 లక్షల ఇళ్లు ఇంత వరకూ ప్రారంభానికి నోచుకోలేదు.
ఈ రెండింటినీ కలిపితే... మొత్తం 36 లక్షల ఇళ్ల పరిస్థితి గందరగోళంలో పడినట్లే! బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు ఉద్దేశించిన సమగ్ర సర్వే గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన నివేదికల తయారీ ప్రక్రియ ఏప్రిల్ నెల రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఈ బోగస్ లెక్కలు తేలితేగానీ కొత్త ఇళ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం కన్పించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. 2010-11 బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.1800 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఇప్పటికే అమలులో ఉన్న ఇళ్ల నిర్మాణానికే సరిపోవని... ఒకవేళ కొత్తవి మంజూరు చేసినా, పనులు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదని అంటున్నారు.
తెరుచుకోని ఖాతాలు
ప్రస్తుతం ఇందిరమ్మ పథకం కింద 17.32 లక్షల ఇళ్ల పనులు సాగుతున్నాయి. ఇందులో కేవలం ఆరు లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచారు. అంటే, సర్కారు చెబుతున్న దాని ప్రకారం చూసినా చెల్లింపులు కేవలం ఈ ఆరు లక్షల మందికి మాత్రమే పరిమితం అయ్యాయి.
ఖాతాలు తెరవని 11.32 లక్షల మంది లబ్ధిదారులకు చెల్లింపులు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు ముందుకు రావటంలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పాత ఇళ్ల పరిస్థితి ఇలా ఉండగా... ఇందిరమ్మ కింద కొత్త ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖపై ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది.
No comments:
Post a Comment