Friday, March 19, 2010

గిరిజనంతో విదేశీ ఆట

టీకా ప్రయోగాల కేంద్రంగా ఖమ్మం ఏజెన్సీ
నలుగురు బాలికల అనుమానాస్పద మృతి!
కారణాలు వేరంటూ ముగించిన సర్కార్!
గిరిజనులపైనే ఎందుకు?: ఎంపీ బలరాం
నిలదీయరన్న నమ్మకంతోనే: సంఘాలు
క్లినికల్ ట్రయల్స్ కాదన్న ఆరోగ్యమంత్రి
తెలంగాణ ప్రజలు జంతువులా: టీఆర్ఎస్

క్యాన్సర్ టీకాల ప్రయోగం వికటించిందన్న వార్తల నేపథ్యంలో అసలా ప్రయోగాలకు రోశయ్య సర్కారు ఎలా అనుమతిస్తుందని కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి నిలదీస్తున్నారు. ఈ టీకాలకు ఎవరు అనుమతిచ్చారో నాకు తెలియదు... అంటూ రోశయ్య.. పరోక్షంగా వాటికి అనుమతి ఇచ్చింది వైఎస్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఇవి క్లినికల్ ట్రయల్స్ కావని స్పష్టం చేస్తున్నారు. బాలికలు చనిపోవడానికి, టీకాలకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఖమ్మం ఏజెన్సీలో ఏం జరుగుతోందో ఒక సారి గమనిస్తే....

లైంగిక సంబంధాల్లో హెచ్‌పీవీ అనే వైరస్ ద్వారా వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించే టీకాను శాస్త్రవేత్తలు 20 ఏళ్ల పాటు పరిశోధించి తయారు చేశారు. దీని పేరు గర్ధాసిల్. దీనిని మూడు డోసులు తీసుకుంటే జీవితాంతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదని కంపెనీ చెబుతోంది. అమెరికా సహా అనేక దేశాల వైద్యసంస్థలు ఈ టీకాను ఆమోదించాయని చెబుతున్నారు.

మన దేశంలో 'పాత్' అనే ప్రభుత్వేతర సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. గుజరాత్‌లోని వడోదరా, ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా ఏజెన్సీలను ఎంచుకుంది.

2008 డిసెంబర్ 31న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. టీకాలకు 10-14 ఏళ్ల వయసు గల బాలికలను ఎంచుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం, తిరుమలాయపాలెంలలో క్యాం పులు పెట్టి 14,091 మంది బాలికలకు టీకాలు వేశారు. వీరిలో 70% గిరిజన బాలికలే. అధికారులు మాత్రం 30% మందే గిరిజన బాలికలని చెబుతున్నారు.

నలుగురి మరణం....
టీకాలు తీసుకున్న వారిలో గిరిజన బాలికలు కె.సరిత (13), సోడే సాయికుమారి(14), క ంపెల్లి స్వాతి(13) ముంద్రబోయిన సూర్యలక్ష్మి (12) చనిపోయారు. సరిత, సాయికుమారి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. సరిత మరణించే నాటికి రెండు డోసుల టీకా తీసుకున్నారు.

భద్రాచలం మండ లం ఎర్రగడ్డకు చెందిన సోడే సాయికుమారి మొదటి దశ టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత మరణించింది. కంపెల్లి స్వాతికి గత ఏడాది జూలై 17న టీకా ఇచ్చారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆగస్టు 8న మరణించారు. సూర్యలక్ష్మి ప్రమాద వశాత్తు చనిపోయినట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.

ఏజెన్సీనే ఎందుకు ఎంచుకున్నారు?
గతంలో చిన్న పిల్లలకు అంగవైక్యలం రాకుండా ఇచ్చే టీకాలకు కూడా తొలుత ఖమ్మం ఏజెన్సీనే ఎంచుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ టీకాలకు కూడా ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. ఇందుకు గిరిజన సంఘాలు కొన్ని కారణాలు చెబుతున్నాయి.

"ఏజెన్సీలో టీకాలు వికటించి మరణించినా... అవి రోజువారి చావు ల ఖాతాలోకి వెళ్తాయి. ఈ మనిషి ఎందుకు చనిపోయాడు? టీకా వికటించిం దా? అని పరిశీలించే నాథుడు ఉండరు. గిరిజనులయితే చెప్పింది వింటారు. గిరిజనేతరులకు చదువు ఉంటుంది కాబట్టి ప్రయోగాలపై సవాలక్ష సందేహాలడుగుతారు. ఎవరైనా చనిపోతే గొడవైపోతుంది. అందుకే గిరిజన ప్రాంతాలను ఎంచుకుంటారు'' అని లంబాడా హక్కుల పోరాట సమితి నేత బెల్లయ్య నాయక్ చెబుతున్నారు.

టీకాలు తీసుకున్నాక తలెత్తిన ఆరోగ్య సమస్యలకు అత్యవసర వైద్యం పొందే అవకాశం ఉండటం లేదు. స్వాతి మరణానికి ఇదే ప్రధాన కారణమని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇక సరిత, సూర్యలక్ష్మిలు ఆత్మహత్యచేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆత్మహత్యలకు ఎలాంటి కారణాలు లేవు. కారణం లేకుండానే ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. పాత్ సంస్థ, ప్రభుత్వ పరపతిని కాపాడుకునేందుకు అధికారులు ఆ మరణాలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏజెన్సీలో ఎలా అనుమతిస్తారు? ఎంపీ బలరాం నాయక్
గిరిజన బాలికల మరణాలపై కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆన్‌లైన్ ఆయన్ను పలకరించినప్పుడు ఆవేదన వ్యక్తం చేశా రు. "ఏజెన్సీలో ప్రయోగాత్మక టీకాలు వేసేందుకు ఎలా అనుమతిస్తారు? హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎందు కు ఆ కార్యక్రమాన్ని అమలు చేయరు?'' అని ప్రశ్నించారు. బాలికల మరణాలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

టీకాలను తెలంగాణ ప్రాంతంలో ప్రయోగించటంపై టీఆర్ఎస్ మండిపడింది. తొలుత జంతువులపై ప్రయోగించాల్సిన మందును మనుషులపై ప్రయోగించటానికి ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందులు ప్రయోగించటానికి తెలంగాణ ప్రజలు జంతువులా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment